ఎన్టీఆర్ కు భారతరత్న... కేంద్రాన్ని ఒప్పిస్తాం: బండి సంజయ్

By Arun Kumar PFirst Published Nov 26, 2020, 11:01 AM IST
Highlights

బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసి దివంగత తెలుగు ప్రధాని పివి నరసింహరావు, మాజీ సీఎం ఎన్టీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గురువారం పివి ఘాట్ ను బండి సంజయ్ సందర్శించారు. 

హైదరాబాద్: బల్దియా ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసి దివంగత తెలుగు ప్రధాని పివి నరసింహరావు, మాజీ సీఎం ఎన్టీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో నాలాలపై వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ముందు హుస్సెన్ సాగర్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన పివి, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే ఘాటుగా స్పందించిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి ఇవాళ(గురువారం) పివి ఘాట్ ను సందర్శించారు. 

నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన పీవీ నరసింహరావు, దివంగత సీఎం ఎన్టీఆర్‌ సమాధులు కూల్చేయాని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను మరోసారి ఖండించారు. పివి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం కాదని... ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం డిల్లీ స్థాయిలో పోరాడిన మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సంజయ్ తెలిపారు. 

ఇక ప్రస్తుతం ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడి అలజడి సృష్టించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ రియాక్ట్ అయ్యారు.  మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి జరుగుతున్న కుట్రలపై పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 

click me!