అవినీతి ఆరోపణలు.. వికారాబాద్ ఎస్పీపై వేటు..?

By telugu news teamFirst Published Nov 26, 2020, 10:51 AM IST
Highlights

 ఎస్పీ తీరుపై మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డీఐజీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు

అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం తోపాటు కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న వికారాబాద్ ఎస్పీ నారాయణపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీగా జానకీ షర్మిలను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.

జానకీ షర్మిల ప్రస్తుతం మహిళా రక్షణ, సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఎస్పీ నారాయణను డీఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేయడంపై జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ధారూరు సీఐ మురళి కుమార్‌ను సప్పెన్షన్‌ చేయడంతోపాటు, ఓ ఠాణాకు చెందిన ఏఎస్‌ఐ.. ఎస్పీ తీరుపై మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డీఐజీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు వారం రోజులుగా తాండూరు, వికారాబాద్‌లో గోప్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. 

పోలీసు ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం.. పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందజేయడంతో వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా యాలాలలో ఇసుక దందాను ఉన్నతాధికారి ప్రోత్సహించారనే ఆరోపణలతో పాటు, పలు సివిల్‌ పంచాయతీల్లో తలదూర్చి పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పెట్రోల్‌ బంక్‌ నుంచి నెలకు 25 లీటర్ల చొప్పున డీజిల్‌ తీసుకొని, సదరు ఇందనానికి సంబంధించిన బిల్లులను సర్కారు నుంచి సుమారు రూ. 75లక్షలు కాజేశారనే విమర్శలు వచ్చాయి.  

click me!