12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొన్నప్పుడు మాట్లాడలేదే : కాంగ్రెస్‌‌పై బండి సంజయ్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Oct 4, 2022, 8:46 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొన్నప్పుడు కాంగ్రెస్ స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

మునుగోడు ప్రజాప్రతినిధులకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. కమ్యూనిస్ట్ కార్యకర్తల త్యాగాలను టీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టారని.. 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొన్నప్పుడు కాంగ్రెస్ స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్ ఎందుకు నిరసన తెలపలేదని.. రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై ఎందుకు బురద జల్లుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం నిధులతో మునుగోడులో ఎంతో సంక్షేమం జరిగిందన్నారు. 

ఇకపోతే.. మునుగోడు అసెంబ్లీ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ముఖ్య నేతలు ఈ నెల 8వ తేదీన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్  లు కూడా హాజరు కానున్నారు.  బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికను పురస్కరించుకొని అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ నేతలు చర్చించనున్నారు. స్టీరింగ్ కమిటీ, మండల ఇంచార్జ్‌లు ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలతో చర్చించనున్నారు.

Also Read:మునుగోడు ఉపఎన్నిక : కొత్త ఓటర్ల నమోదుకు యత్నం.. పార్టీల స్కెచ్, యువత కరుణ ఎవరి వైపో

కాగా.. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మునుగోడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ నవంబర్ 8తో ముగియనుంది. 

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రణాళికులు రచించాయి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశాయి. బీజేపీ తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపనుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  
 

click me!