ఇంకెన్నాళ్లీ బాధలు.. కర్ణాటక తరహాలో అధికారం అందుకోవాల్సిందే: బండి సంజయ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 19, 2021, 4:59 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఇంకెన్నాళ్లీ బాధలు భరించాలన్న ఆయన.. తెగించి కొట్లాడుదామంటూ పిలుపునిచ్చారు. కర్ణాటక తరహాలో ఉద్యమించి అధికారం చేజిక్కించుకుందామని సంజయ్ స్పష్టం చేశారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఇంకెన్నాళ్లీ బాధలు భరించాలన్న ఆయన.. తెగించి కొట్లాడుదామంటూ పిలుపునిచ్చారు. కర్ణాటక తరహాలో ఉద్యమించి అధికారం చేజిక్కించుకుందామని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందని.. కర్ణాటక తరహాలో ఉద్యమించి బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని సంజయ్ అన్నారు. 

కాగా, ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు భారీగా కదలి రావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా బీజేపీతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో అవినీతి, కుటుంబపాలనను అంతమొందిద్దామని.. ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని బండి సంజయ్ చెప్పారు. సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

ఈ నెల 24వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  పాదయాత్ర చేయాలని  బీజేపీ చీఫ్ నిర్ణయం తీసుకొన్నాడు.ఈ నెల మొదటి వారంలోనే  పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో  పాదయాత్రను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.


 

click me!