ఇస్లాం కోసం ఒకరు.. క్రైస్తవ రాజ్యం కోసం మరొకరు:కేసీఆర్‌, జగన్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 25, 2020, 8:45 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి మైనారిటీలకు కొమ్ము కాస్తున్నాడని.. ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవ రాజ్యం కోసం పాకులాడుతూ, మత మార్పిడీలకు ఊతం ఇస్తున్నారని సంజయ్ ఆరోపించారు

తెలంగాణ ముఖ్యమంత్రి మైనారిటీలకు కొమ్ము కాస్తున్నాడని.. ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవ రాజ్యం కోసం పాకులాడుతూ, మత మార్పిడీలకు ఊతం ఇస్తున్నారని సంజయ్ ఆరోపించారు. హిందూ దేవాలయాల ఆస్తుల జోలికి వస్తున్న ఈ నేతలకు దమ్ముంటే.. ఇతర మతస్తుల జోలికి ఎందుకు పోవడం లేదని ఆయన నిలదీశారు.

హిందువులు ఎప్పుడూ సహనంతో ఉంటారని.. కానీ వీరి సంయమనాన్ని పిరికితనంగా భావించవద్దని బండి సంజయ్ హెచ్చరించారు. విడిపోయి కలిసుందామనే రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

సోమవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు దేశాభివృద్ధే ముఖ్యమని పవన్ అన్నారని ఆయన చెప్పారు. కరోనా కట్టడి, దేశాభివృద్ధి తదితర అంశాల విషయంలో ప్రధాని మోడీ ఆలోచనా విధానాలు నచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సహాయ సహకారాలు అందిస్తున్నారని సంజయ్ గుర్తుచేశారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాంతీయ విద్వేషాలను రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని, లేదంటే అడ్డదారిలో ప్రజలను దోచుకోవాలని ఆలోచిస్తున్నారని బండి ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు విషయంలో తాము ఏపీ, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని.. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పన్నుతున్న పన్నాగాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు సంజయ్ స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రజలకు న్యాయం చేయాలనే అంశంపై తాను పవన్‌తో చర్చించానని ఆయన వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ అవసరమైన పక్షంలో బీజేపీకి సహకరిస్తానని పవన్ హామీ ఇచ్చారని సంజయ్ చెప్పారు. రాజకీయ అంశాలపై మళ్లీ పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతానని బండి తెలిపారు. ఇక ఏపీలో హాట్ టాపిక్‌గా ఉన్న టీటీడీ ఆలయ భూముల వేలంపై ఆయన స్పందించారు.

ఆస్తులను కాపాడేందుకు కమిటీలు వేయాలి కానీ, హిందు దేవాలయాల ఆస్తులను అమ్ముకునేందుకు ఎవరూ కమిటీలు వేయరని సంజయ్ అన్నారు. గతంలో ఎవరో తప్పు చేశారని.. తిరిగి మీరు తప్పు చేయొద్దంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన హితవు పలికారు.

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు, పలు ప్రభుత్వాలు హిందూ దేవాలయాల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నాయి కానీ.. పరిరక్షించాలని మాత్రం ఆలోచించడం లేదని బండి ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక మంది భక్తులు ఆస్తులను అమ్ముకుని మరి శ్రీవారి హుండీలో మొక్కులు చెల్లించుకుంటున్నారని సంజయ్ గుర్తుచేశారు. ప్రజల ఆస్తులను అమ్ముకుని మొక్కులు తీర్చుకుంటుంటే.. ఆ ఆస్తులను అమ్ముకునే హక్కు, అధికారం పాలకమండలికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

click me!