Munugode bypoll 2022 : బిజెపి దూకుడు... అమిత్ షా సభకు 18మంది ఇంచార్జీల నియామకం

By Arun Kumar PFirst Published Aug 18, 2022, 11:43 AM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బిజెపి 21న అమిత్ షా పాల్గొనే బహిరంగ సభను భారీగా నిర్వహించాలని చూస్తోంది. ఇందుకోసం మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారిగా ఇంచార్జీలను నియమించారు. 

నల్గొండ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్టీకి, పదవికి రాజీనామా చేయించి మరో ఉపఎన్నికకు తెరతీసింది. ఇలా కోరితెచ్చుకున్న మునగోడు ఉపఎన్నికలను బిజెపి అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో మునుగోడు ప్రజలముందే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోడానికి ఆగస్ట్ 21న బిజెపి భారీ బహిరంగను ఏర్పాటుచేసింది. ఈ బహిరంగ సభ ద్వారా ప్రత్యర్థులకు చెమటలు పట్టించాలని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలో బహిరంగ సభకు జనసమీకరణ చేపట్టే బాధ్యతను తెలంగాణ బిజెపి అధ్యక్సుడు బండి సంజయ్ పార్టీ సీనియర్లకు అప్పగించారు. 

మునుగోడు నియోజకవర్గంలోని మండలాల వారిగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు బండి సంజయ్. మండలానికి ఇద్దరు చొప్పున మొత్తం 9 మండలాలకు 18 మంది నాయకులను అమిత్ షా సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 

మండలాల వారిగా ఇంచార్జీల వివరాలు: 

మునుగోడు : ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి

చౌటుప్పల్ అర్భన్ : గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి 

చౌటుప్పల్ రూరల్ : ఏపీ జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

సంస్థాన్ నారాయణపూర్ : కూన శ్రీశైలంగౌడ్, రవీంద్ర నాయక్ 

చండూరు : రాజాసింగ్, విజయ్ పాల్ రెడ్డి

గట్టుప్పల్ : రఘునందన్ రావు, రాపోలు ఆనంద్ భాస్కర్ 

మర్రిగూడెం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టి. ఆచారి

నాంపల్లి : ఏ. చంద్రశేఖర్ , ధర్మారావు

Read More  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మిత్రుడు.. బీజేపీలో చేరినవాళ్లు ఏదైనా మాట్లాడతారు: మాణిక్కం ఠాగూర్

మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బిజెపిలోకి భారీగా నాయకుల చేరికలుంటాయన్న తరుణ్ చుగ్ ప్రకటన రాజకీయంగా సంచలనం రేపుతోంది. అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ లో చాలామంది అసంతృప్తులు వుండటంతో ఎప్పుడు ఎవరు రాజీనామా ప్రకటనలు చేస్తారో అన్న భయం ఆయా పార్టీలకు పట్టుకుంది. బిజెపి కూడా భారీ చేరికలంటూ ముమ్మర ప్రచారం చేస్తూ ఆ పార్టీలపై ఒత్తిడిని మరింత పెంచుతోంది. 

ఆగస్ట్ 21 ఆదివారం సాయంత్రం 4 గంటలకు బిజెపి ఆధ్వర్యంలో జరిగే మునుగోడు సభ ప్రారంభవుతుందని తరుణ చుగ్ తెలిపారు. ఈ సభలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాడాలనేది పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని అన్నారు. అదే సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారని.... ఇతర పార్టీల నుంచి బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణ బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీకే ప్రజల మద్దతు ఉందని తరుణ చుగ్ అన్నారు.
 

click me!