‘‘సేవ్ సాయిల్’’కి తెలంగాణ మద్ధతు.. ఈశా ఫౌండేషన్‌తో ఎంవోయూ, భారత్‌లో ఆరవ రాష్ట్రంగా ఘనత

Siva Kodati |  
Published : Jun 16, 2022, 09:42 PM ISTUpdated : Jun 16, 2022, 09:43 PM IST
‘‘సేవ్ సాయిల్’’కి తెలంగాణ మద్ధతు.. ఈశా ఫౌండేషన్‌తో ఎంవోయూ, భారత్‌లో ఆరవ రాష్ట్రంగా ఘనత

సారాంశం

సేవ్‌ సాయిల్‌ నినాదంలో భాగంగా ఈశా ఫౌండేషన్‌ , తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో ఈ మేరకు మంత్రి నిరంజన్‌రెడ్డి, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 

సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్‌మెంట్‌లో (మట్టిని రక్షించే ఉద్యమం) అధికారికంగా చేరిన ఆరవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు ఈశా ఔట్‌రీచ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సద్గురు జగ్గీ వాసుదేవ్‌లు పరస్పరం పత్రాలు మార్పు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సేవ్ సాయిల్ ఈవెంట్‌లో ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, దయాకర్ రావు, సినీనటుడు సమంత, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రైతు నేస్తం ఫౌండేషన్‌కు చెందిన పద్మశ్రీ వెంకటేశ్వరరావు, గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ, స్మిత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, పర్యావరణ వేత్త విజయ్ రామ్, శిల్పారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నేల లేనిదే జీవం లేదని, జీవం సాగాలంటే నేలను కాపాడుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 30 శాతం భూమి ఎడారిగా మారిందని, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మానవ జాతికే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలు మట్టి మనుషులుని, ఈ నేలకోసమే ముందు తరాలు అలుపెరగని పోరాటం చేశాయని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. నేల, పర్యావరణాన్ని కాపాడుకోవడం యూఎన్‌వో-17 లక్ష్యాల్లో ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు.

నేలను, పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే పర్యావరణహిత నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు. హరితహారం ద్వారా 250 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని.. వర్షపు నీటిని సముద్రంలోకి వెళ్లకుండా ఒడిసి పట్టిన రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భూగర్భ జలాలను పెంచడంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణ నేలంతా పచ్చబడిందని .. నేల పరిరక్షణకు ఈశా ఫౌండేషన్‌ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక సినీనటి సమంతతో జరిగిన సంభాషణలో జగ్గీదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో రిస్కీ బైక్ రైడ్.. గురించి ఆయన మాట్లాడుతూ.. తాను గడిచిన 30 సంవత్సరాలుగా దాని గురించి (మట్టిని కాపాడటం) మాట్లాడుతున్నానని తెలిపారు. దాని గురించి తాను ఎప్పుడు మాట్లాడినా.. ఇది గొప్పది, ఇది అద్బుతమని ప్రజలు చెబుతారని వాసుదేవ్ అన్నారు. కానీ ఆ వెంటనే జనం నిద్రపోతారని.. అందుచేత వాళ్లని మేల్కోలపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం 2.8 బిలియన్ల మంది ప్రజలు మట్టి గురించి మాట్లాడినట్లుగా తమ సోషల్ మీడియా గణాంకాలు చెబుతున్నాయని వాసుదేవ్ అన్నారు. ఇక నదీజలాల సంరక్షణ గురించి అడగ్గా.. ఖచ్చితం నదీ జలాలు సముద్రంలో కలవాలని, అలా జరగని పక్షంలో ఒకదేశంలో 100 కిలోమీటర్ల వరకు సముద్రం ముందుకు చొచ్చుకొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒక దేశం 100 కిలోమీటర్ల మేర భూ భాగాన్ని కోల్పోయినట్లేనని వాసుదేవ్ పేర్కొన్నారు.

ప్రముఖ నేపథ్య గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల తమ గాత్రం ద్వారా మట్టిని కాపాడాల్సిన అవసరం గురించి అద్భుతంగా అలపించారు. మహా శివరాత్రి రోజున మట్టి గురించి ఒక పాటను పాడాల్సిందిగా తనను జగ్గీ వాసుదేవ్ కోరినట్లు మంగ్లీ ప్రజలకు తెలిపారు. దీనిలో భాగంగానే తాజా ఈవెంట్‌లో మట్ల తిరుపతి రచించిన గీతాన్ని ఆమె ఆలపించారు. ఈ పాట పాడుతుండగా ప్రజల రెస్పాన్స్ చూసిన జగ్గీ వాసుదేవ్.. మంగ్లీ, రామ్ మిరియాలలతో కలిసి డ్యాన్స్ చేశారు. 

ఇప్పటి వరకు భారతదేశంలో 30 శాతం సారవంతమైన భూములు బంజరు నేలలుగా మారిపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. తక్షణ విధాన సంస్కరణల ద్వారా వ్యవసాయ నేలల్లో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రీయ కంటెంట్‌ను భాగం చేయాలని ‘‘సేవ్ సాయిల్’’ ఉద్యమిక ప్రాథమిక లక్ష్యం. ఇక.. ఢిల్లీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జగ్గీ వాసుదేవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమం ఆవశ్యకతను ప్రధాని తెలిపారు. సద్గురు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్ధతు ప్రకటిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి.

మార్చి 21, 2022న ప్రారంభమైన జగ్గీ వాసుదేవ్ బైక్ యాత్ర.. యూరప్, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాన్ని కవర్ చేసింది. అనంతరం మే 29న గుజరాత్‌లోని పశ్చిమ నౌకాశ్రయ నగరం జామ్‌నగర్‌కి చేరుకుంది. భారత్‌లో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ఆయన యాత్ర సాగింది. మరోవైపు జగ్గీ వాసుదేవ్ ఉద్యమం కోట్లాది మందికి చేరువైంది. 74 దేశాలు తమ దేశాల్లోని నేలల సంరక్షించడానికి అంగీకరించాయి. 27 దేశాల గుండా సాగిన ఆయన ప్రయాణం తర్వాత 2.8 బిలియన్ల మంది ప్రజలు మట్టి గురించి మాట్లాడుతున్నారు. అలాగే భారత్‌లోని 15 లక్షల మంది చిన్నారులు ఈ దేశంలోని నేలను, వారి భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేయాల్సిందిగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?