తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.ఈ నెల 12న అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. తమ శాఖలకు చెందిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
undefined
తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రవేశ పెట్టనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యానాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొంటారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ చర్చించింది. బీఎసీ సమావేశం తర్వాత మరోసారి సమావేశం కావాలని సీఎల్పీ భావిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల నాటి నుండి ఈ సమావేశాలకు మరో ఎమ్మెల్యేను కాంగ్రెస్ కోల్పోయింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించిన విషయం తెలిసిందే.