
హైదరాబాద్: ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు గురువారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ 24వ తేదీన ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశమై అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయనున్నారు.కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.