హుజురాబాద్ లో బిజెపికి ఓట్లడిగే హక్కులేదని హరీష్ అనడం సిగ్గుచేటు..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 16, 2021, 5:00 PM IST
Highlights

కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టే అన్నిచట్టాలకు మీ మామ కేసీఆర్ జైకొడుతుంటే... నువ్వు అదే బిజెపిని విమర్శించడం హాస్యాస్పదంగా వుందంటూ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  

కరీంనగర్: హుజురాబాద్ లో బిజెపికే కాదు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అలాంటిది బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదని హుజురాబాద్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రవేశపెట్టే అన్నిచట్టాలకు మీ మామ కేసీఆర్ జైకొడుతుంటే... నువ్వు అదే బిజెపిని విమర్శించడం హాస్యాస్పదంగా వుందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  

కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక చట్టాలను తీసుకువచ్చినా వాటిని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించకపోవడమే ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయనే విషయాన్ని బయటపెడుతుందన్నారు. ఇప్పటివరకు కనీసం ఒక్కసారి అయినా వాటిపై స్పందించారా? అని జీవన్ ప్రశ్నించారు. 

ఇక తాజాగా ఉప్పుడు బియ్యం కొనమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది... దీనిపైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక మతలబేంటి..? తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉప్పుడు బియ్యం కొనేలా చేసి రైతులను ఆదుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

వీడియో

ఇక దళితబంధు గురించి మాట్లాడిన జీవన్ రెడ్డి... ముందుగా హామీ ఇచ్చినట్లు ఏడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు.  దళితుల మనోభావాలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ పార్టీ  దళితుల్లో చైతన్యం ఏర్పడింది అనడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన నిధులను కూడా  పూర్తిగా వారికే ఖర్చుచేయలేకపోయిందని... దారిమళ్లించి దోచుకున్నవారే ఇప్పడు దళిత సాధికారత అంటూ గొప్పలు చెబుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.  

read more  హుజురాబాద్ లో ఓటుకు ముప్పై వేలు... అది గుర్తు పెట్టుకుని ఓటేయండి: హరీష్ సంచలనం (వీడియో)

ఏడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత సామాజికవర్గ ప్రజలకు కనీసం నిలువనీడ కల్పించలేదని... ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు ద్వారా రూ.10లక్షలు ఇస్తామనడం విడ్డూరంగా వుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తో పాటు దళిత బంధు  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని జీవన్ రెడ్డి కోరారు. 

ఇక శుక్రవారం సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సభకు  పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా తరలివచ్చి విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

click me!