తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్, మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి ప్రత్యర్థి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయ కదనం సాగిస్తున్నాయి. ప్రత్యర్థులు ఎత్తులు వేస్తే వాటిని చిత్తుచేసేలా పైఎత్తులు వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు మిత్రపక్షం మజ్లిస్ తో కలిసి బిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. అందులో భాగమే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పోటీ నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు దక్కింది. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ముస్లిం ఓటర్లుండటంతో కాంగ్రెస్ అజారుద్దీన్ బరిలోకి దింపుతోంది. దీంతో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారట. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లను చీల్చగలిగితే తిరిగి బిఆర్ఎస్ గెలవడం ఖాయమన్నది కేసీఆర్ ప్లాన్ అయివుంటుంది. ఇందుకోసమే మిత్రపక్షం ఎంఐఎంను జూబ్లీహిల్స్ బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. వ్యూహం కేసీఆర్ ది అయితే అమలుచేస్తున్నది మాత్రం ఎంఐఎం అని తెలుస్తోంది.
సాధారణంగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనే ఎంఐఎం పోటీచేస్తుంటుంది. కానీ ఈసారి మరో రెండు నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగనున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ప్రకటించారు. ఈ నిర్ణయం మిత్రపక్షం బిఆర్ఎస్ ను గెలిపించేందుకే జరిగిందని... ఇది కేసీఆర్ ప్లాన్ అయివుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోని ముస్లింల ఓట్లన్ని గంపగుత్తగా ఆయనకే పడే అవకాశాలుండటంతో కేసీఆర్ ఎంఐఎంను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ లో షేక్ పేట కార్పోరేటర్ మహ్మద్ రషీద్ పోటీ చేస్తున్నాడు. అతడి ఎంట్రీతో ముస్లింల ఓట్లు చీలిపోయి బిఆర్ఎస్ లాభం చేకూరుతుంది. ఇదే కేసీఆర్ కోరుకుంటున్నారని... ఆయన ప్లాన్ నే ఎంఐఎం అమలుచేస్తోందన్నది రాజకీయ పరిశీలకు అభిప్రాయం.