పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తుందని.. బీఆర్ఎస్ చేసే రాజకీయ కుట్రలను అడ్డుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని అన్నారు. ఐటి దాడులు బీఆర్ఎస్, బిజెపి చేస్తున్న రాజకీయ కుట్ర అన్నారు. ఖమ్మం పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి అయిన పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి ఐటి దాడులు నిర్వహిస్తుంది. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. జరుగుతాయని రెండు రోజుల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. నేడు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఉదయం 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పాలేరు, హైదరాబాద్ లలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పొంగులేటికి చెందిన నివాసాల్లో ఉదయం 6 గం.లనుంచే దాడులు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
అయితే, ఎంపీ సీటు ఇస్తామని ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తరువాత ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల మీద ఐటీ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలోనే పొంగులేటి రెండు రోజుల క్రితమే తన మీద కూడా ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. అలాగే జరిగింది.