Telangana Assembly Elections:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం జోరుగా సాగుతున్న వేళ మద్యం ప్రియులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్యాడ్ న్యూస్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఎప్పుడంటే..?
Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులు, బార్లను బంద్ పెట్టనున్నది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచనలు చేసింది.
తెలంగాణలో నవంబర్ (ఈ నెల) 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజులు వైన్స్ లను మూసివేయాలని అధికారులను ఆదేశించింది. మళ్లీ డిసెంబర్ 1న వైన్ షాపులు తెరచుకోనున్నాయి. ఈ మేరకు వైన్స్, బార్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించాలని ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేయకూడదని ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో జోరుగా మద్యం పంపిణీ జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో.. తనిఖీలను ప్రారంభించింది. అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్ట్యా ఈసారి ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. మరో పది రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరుగనున్నది.
సీ-విజిల్ (CVIGIL)యాప్ ద్వారా ఫిర్యాదు
ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం, డబ్బులు ఓటర్లకు సరఫరా చేసినా, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడినా, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా , అల్లర్లు, గొడవలకు పాల్పడినా సీ-విజిల్ (CVIGIL)యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేసినచో.. వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.