ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి బరిలో నిలవడమే ఇందుకు కారణం
హుజూర్‌నగర్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి బరిలో నిలవడమే ఇందుకు కారణం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది.హుజూర్‌నగర్ నుండి రెండు దఫాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.ఈ స్థానం నుండి హ్యాట్రిక్ సాధించేందుకు ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్ఆర్ఐ సైదిరెడ్డి ఉత్తమ్ ప్రయత్నాలను అడ్డుకొంటారా లేదా అనేది డిసెంబర్ 11న, తేలనుంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, మంచినీటీ స్కీమ్స్, మట్టపల్లిపై బ్రిడ్జి నిర్మాణాలు, హుజూర్‌నగర్‌లో మోడల్ కాలనీ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు, మెయిన్ రోడ్డు విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు, ఎత్తిపోతల ద్వారా చివరి భూములకు నీరివ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.ఈ కార్యక్రమాలన్నీ తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
undefined
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్ఆర్ఐ సైదిరెడ్డి బరిలోకి దిగారు. సైదిరెడ్డి రాష్ట్ర అపద్ధర్మ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. హుజూర్‌నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ టికెట్టు కోసం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ స్థానంలో అప్పిరెడ్డి, సైదిరెడ్డిలు కూడ టికెట్టు కోసం ప్రయత్నించారు. శంకరమ్మ తనకు టికెట్టు రాకున్నా అప్పిరెడ్డికి టికెట్టు ఇవ్వాలని శంకరమ్మ కోరారు. కానీ, కేసీఆర్ మాత్రం సైదిరెడ్డికే టికెట్టు ఇచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నందున హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ ప్రంట్ అభ్యర్థుల తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో హుజూర్‌నగర్ లోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలే ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకొన్నారు.
ఉత్తమ్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో ఉన్న పట్టు కాంగ్రె్‌సకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గంలో బంధుత్వం, పరిచయాలు ఉన్నాయి. తీవ్ర పోటీలో కూడ టీఆర్ఎస్ టికెట్టు సైదిరెడ్డికి దక్కింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే సైదిరెడ్డి పుట్టాడు. విద్యాభ్యాసాన్ని కూడ ఈ ప్రాంతంలోనే చేశాడు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి సైదిరెడ్డి వచ్చారు.సైదిరెడ్డి తండ్రి మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
బీజేపీ అభ్యర్థిగా బొబ్బా భాగ్యరెడ్డి కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2004లో పీఆర్‌పీ టికెట్టును భాగ్యరెడ్డి ఆశించారు. కానీ పీఆర్పీ టికెట్టు దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో బీజేపీలో చేరారు. హుజూర్‌నగర్ నుండి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా నేరేడుచర్ల మాజీ ఎంపీపీ, సీపీఎం నేత పారేపల్లి శేఖర్ రావు బరిలోకి దిగారు.
హుజూర్‌నగర్ నుండి మూడో దఫా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అభ్యర్ధిగా ప్రచారంలో ఉంది. పీపుల్స్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల రేసులో ఉత్తమ్ పేరు కూడ ఉంటుంది. ఇది ఉత్తమ్ కు కలిసొచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉత్తమ్ కు కలిసి రానుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పార్టీ అవసరాల రీత్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువగా హైద్రాబాద్ కే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ద్వితీయశ్రేణి నాయకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.
టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గంలో బంధుత్వం ఉంది. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమకు కలిసి వస్తాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కొందరు అసంతృప్తితో ఉన్నారు.సామల శివారెడ్డి రెబెల్‌గా బరిలో ఉండడం సైదిరెడ్డికి కొంత నష్టం కల్గించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి ఉత్తమ్ పోటీలో ఉంటారని భావిస్తున్న నేపథ్యంలో జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి తదితరులు సైదిరెడ్డికి పరోక్షంగా సహకరించే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్ లో ఓటమి పాలైతే సీఎం అభ్యర్ధికి పోటీ తగ్గే అవకాశం ఉంటుందని ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇదే జరిగితే టీఆర్ఎస్ కు కొంత అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.