రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన వరంగల్ నగరంలోని వెస్ట్ నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోటగా వుంది. ఇక్కడి నుంచి దాస్యం వినయ్ భాస్కర్ దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి పాతికేళ్లు పైనే అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్ధులు, వారి తరపున అగ్రనేతలు ప్రచారం చేస్తూ వుండటంతో మాటల యుద్ధం జరుగుతోంది. అటు గెలిచేందుకు వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్‌పై ఆయా పార్టీల అధినాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. దాదాపు 70 నుంచి 90 స్థానాల్లో నువ్వానేనా అన్నట్లు ఈ రెండు పార్టీల అభ్యర్ధులు తలపడుతున్నారు. వీటిలో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన చాలా ఏళ్లే అవుతోంది. అలాంటి వాటిలో ఒకటి వరంగల్ వెస్ట్.
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన వరంగల్ నగరంలోని వెస్ట్ నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోటగా వుంది. ఇక్కడి నుంచి దాస్యం వినయ్ భాస్కర్ దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి పాతికేళ్లు పైనే అవుతోంది. అయితే ఈసారి ఎలాగైనా సారే వరంగల్ వెస్ట్‌లో గెలిచి తీరాలని పార్టీ నేతలు కృతనిశ్చయంతో వున్నారు. హన్మకొండ జిల్లాలో భాగమైన ఈ నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ తర్వాత కొత్తగా ఏర్పడింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి.
2009లో వరంగల్ వెస్ట్ ఆవిర్భవించిన నాటి నుంచి బీఆర్ఎస్ తరపున దాస్యం వినయ్ భాస్కర్ గెలుస్తూ వస్తున్నారు. మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన విజయం సాధించారు. తొలుత 2004లో ఇక్కడ బీఆర్ఎస్‌కే చెందిన మందాడి సత్యనారాయణ రెడ్డి గెలిచారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. 1978లో టీ.హయగ్రీవా చారి, 1989లో జరిగిన ఉప ఎన్నికలో పీవీ రంగారావు, 1983లో టీడీపీ అభ్యర్ధి సంగంరెడ్డి సత్యనారాయణ, 1985లో తెలుగుదేశానికే చెందిన వి. వెంకటేశ్వరరావ్ విజయం సాధించారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 1994లో టీడీపీ నుంచి గెలుపొందారు. 1999లో బీజేపీ అభ్యర్ధి మార్తినేని ధర్మారావు గెలిచారు.
అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంచుకోటను బద్ధలు కొట్టాలని పట్టుదలగా వుంది. ఈ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్‌ను ఓడించడం పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగానూ.. రాజకీయ పరిణామాల్లో మార్పు రావడానికి సంకేతంగానూ భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ 25 ఏళ్ల తర్వాత ఇక్కడ గెలుస్తుందా..? లేక బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందా..? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.