ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలపై మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలపై మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన ర్యాలీ చేపట్టినందుకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఇంతియాజ్‌పై రెండేళ్ల క్రితం పార్టీ నాయకుడు ఒకరిన బెదిరించినట్టుగా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇంతియాజ్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం ప్రశ్నించారు.
పోలీసుల చర్యలకు నిరసనగా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, రెండు వందల మంది పార్టీ కార్యకర్తలు వోల్టా హోటల్ ఎక్స్ రోడ్డు నుంచి హుస్సేనియాలం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎంఐఎం నేతలు, కార్యకర్తల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గ రిటర్నింగ్ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, తదితరులు అక్రమంగా నిరసన ర్యాలీ నిర్వహించారని, ఆ విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని మొగల్‌పురాలోని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంగనాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన మొఘల్‌పురా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.