ఇవాళ నామినేషన్ వేయనున్న మంత్రి హరీష్ రావుపై తెల్లవారుజామును పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆయన కారుతో పాటు కాన్వాయ్ లోని వాహనాలను కూడా పోలీసులు చెక్ చేసారు.
సిద్దిపేట : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. సిద్దిపేట నుండి మరోసారి బరిలోకి దిగిన హరీష్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునే కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆయన వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికల నిబంధనలను అనుసరించే పోలీసులు మంత్రి హరీష్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసారు. హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులు, బిఆర్ఎస్ నేతలు పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. ఎన్నికల విదుల్లో భాగంగానే వాహనాల తనిఖీ చేపట్టినట్లు... ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్ ని కూడా ఆపినట్లు పోలీసులు తెలిపారు. తమకు సహకరించినందుకు మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
పోలీసులు తనిఖీ అనంతరం మంత్రి కాన్వాయ్ కొండగట్టు దేవాలయం వైపు కదిలింది. కొండగట్టు ఆంజనేయస్వామి చెంత తన నామినేషన్ పత్రాలను వుంచి ప్రత్యేకపూజలు చేసారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు మంత్రి హరీష్ రావును ఆశీర్వదించారు. స్వామి ఆశిస్సులతో మరోసారి సిద్దిపేటలో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నానని... బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు.
Read More Telangana Assembly Elections 2023 : ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
ఇదిలావుంటే సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ని కూడా ఇటీవల నిజామాబాద్ లో పోలీసులు తనిఖీ చేసారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్ రోడ్డుమార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్‌లోని వాహనాలు నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా పికెట్ పాయింట్ వద్ద కేసీఆర్ కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహించారు.
అలాగే మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు అని తేడాలేకుండా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నామని... అందులో భాగమే ఈ తనిఖీలని పోలీసులు తెలిపారు.