Telangana assembly elections 2023: ఆ 12 మందిపై ప్రతీకారం, ప్రత్యేక వ్యూహం

By Pratap Reddy KasulaFirst Published Aug 24, 2023, 9:02 AM IST
Highlights

తమ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. అందుకు సునీల్ కనుగోలు ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నారు.

హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి, బిఆర్ఎస్ లో చేరిన 12 మంది శాసనసభ్యులను ఓడించాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. వాళ్లకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి అమలు చేయాలని అనుకుటోంది. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించి తీరాలని పట్టుదలతో ఉంది. తమ పార్టీలో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 11 మందికి తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్లు ఖరారు చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయిస్తోంది. తమ పార్టీ బిఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను ఓడించడానికి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మాత్రమే కేసిఆర్ టికెట్ ఖరారు చేయలేదు.

మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. ఆమెకు కేసీఆర్ మంత్రిపదవి ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ఇద్దరు సభ్యుల్లో ఆమె ఒకరు. ఎల్బీ నగర్ శాసనసభ్యుడు డి. సుధీకర్ రెడ్డికి కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

మిగతావాళ్లకు పదవులు ఏమీ ఇవ్వలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 12 మంది శాసనసభ్యులు కూడి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బిఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ ఎమ్మెల్యేల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), హరిప్రియ నాయక్ (ఇల్లందు), వనం వెంకటేశ్వర రావు (కొత్తగూడెం), రేగా కాంతారావు (పినపాక), పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), జె. సురేందర్ (ఎల్లారెడ్డి) ఉన్నారు.

దాంతో శాసనసభలో కాంగ్రెస్ సంఖ్యాబలం 19 నుంచి ఆరుకి తగ్గింది. హుజూర్ నగర్ నుంచి విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోకసభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు.

కాంగ్రెస్ తరఫున గెలిచి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బలమైన అభ్యర్థులను పోటీకి దించడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ నుంచి జూపల్లి క్రిష్ణారావును, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పోటీకి దించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఎల్బీ నగర్ అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ ను పోటీ దించే విషయాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. 

టికెట్లు దక్కని బిఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీ మారే విషయంపై తమ అనుచరులతో మాట్లాడారు. తనకు పాలేరు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని అడిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

click me!