తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 10 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే.. నామినేషన్ చేసేందుకు బలమైన ముహూరాల కోసం నాయకులు జ్యోతిష్యుల వద్దకు క్యూ కడుతున్నారట. ఇంతకీ ఏ రోజులు మంచిగా ఉన్నాయంటే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రచారం పర్వంతో జోరుగా సాగుతుండగా.. నిన్నటితో నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా ప్రారంభమైంది. అయితే.. ఏదైనా ఒక పని అయినా చేసే ముందు ముహూర్తం చూసుకుని మరి పని ప్రారంభం లేదా చేయటం సర్వ సాధారణం. ఇక రాజకీయ నాయకుల విషయం చెప్పక్కర్లేదు. వాళ్లు ఇలాంటివి బాగా పాటిస్తారు. ప్రతి విషయయానికి మీనా మేషాలు లెక్కిస్తారు. అదే తమ రాజకీయ జీవితాలను నిర్ణయించే నామినేషన్ల విషయంలో ముహుర్తాలు చూడకుండా ఎలా ఉంటారు.
ఎన్నికల బరిలో నిలిచే నేతలందరూ వారి వారి నమ్మకాలను అనుసరించి ముహుర్తాలు చూసుకుని నామినేషన్లు వేయనున్నారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగటంతో మంచి రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు నేతలు సిద్ధమౌతున్నారు. ఇందుకోసం ఎన్నికల పోరులోని నిలిచిన నేతలంతా తమ తమ పురోహితులు, పండితులను సంప్రదించి.. తమ జాతకాల ప్రకారం ఏ రోజు ఏ సమయంలో నామినేషన్లు వేస్తే బాగుంటుందనే విషయమై ఆరా తీసుకుంటున్నారట.
సుముహుర్తాలు ఇవే..
నామినేషన్లు ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభం కాగా.. 10 తేదీతో ముగియనున్నది. ఈ ఎనిమిది రోజుల్లో 5 వ తేదీ ఆదివారం రావడంతో ఆ రోజు సెలవు. ఇక మిగిలింది ఏడు రోజులు మాత్రమే.. కాగా ఈ నెల 8, 9, 10 తేదీలు మాత్రమే మంచిరోజులని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యల లెక్కల ప్రకారం.. 8వ తేది బుధవారం దశమి, పూర్వ ఫాల్గుణి, అలాగే.. 9వ తేది గురువారం ఏకాదశి ఉత్తర నక్షత్రం, 10 వ తేది శుక్రవారం ద్వాదశి చిత్త నక్షత్రం .. ఈ మూడు రోజుల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయనీ, ఈ రోజులు నామినేషన్లకు మంచిదని పండితులు కూడా చెపుతున్నారు.
అందుకే సీఎం కేసీఆర్ కూడా జ్యోతిష్య పండితులు సూచనల ప్రకారం.. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారట. సీఎం కేసీఆర్ నామినేషన్ వేసే రోజే ఇతర లీడర్లు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.