తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెరిగింది. ఆ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను నే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రచారంపై ఫోకస్ చేసి.. ఈ తరుణంలో ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. ఈ పార్టీ అధినేత కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రోజుకు రెండు నుంచి మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. ఆ పార్టీ తమ అగ్రనేతలను ప్రచారంలో దించింది. నేడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.భారీ బహిరంగం సభలో ప్రసంగిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమరాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని భావిస్తోంది. ప్రధాని మోడీతోపాటు జాతీయ నేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు పలువురు నేతలు పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. నేడు బీజేపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇక ప్రచారంపై మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యటించనున్నారు.
ఈనెల 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇలా ఒకే వారంలో రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి రానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి బీజేపీ మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది. జోరుగా ప్రచారం చేయాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచార రంగంలో పాల్గొనున్నారు. ప్రచారం మరింత పీక్స్ వెళ్లే సమయంలో ఈ నెల 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.
ప్రధాని మోడీ తెలంగాణ రాక మరోసారి రాజకీయం హీటెక్కుతాయనే చెప్పాలి. గత నెలలో నిజామాబాద్ లో పర్యటించిన ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్‌పై సంచనల ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ .. తన కొడుకు కేటీఆర్‌ను తరువాత ముఖ్యమంత్రి చేయబోతున్నారని, ఆ విషయాన్ని తనకు సీఎం కేసీఆర్ చెప్పారని అనారు. కానీ, ఆ విషయాన్ని తాను అంగీకరించలేదని అన్నారు.
వారసులను తదుపరి ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ ఏమైనా రాజా? చక్రవర్తా? అంటూ విమర్శించారు. అంతేకాదు ఎన్డీయేలో చేరేందుకు కూడా కేసీఆర్ ఓకే అన్నారని కూడా చెప్పారని అన్నారు. కానీ ప్రధాని మోడీ వ్యాఖ్యలను గులాబీ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు.. ఎన్నికల ప్రచార జోరును పెంచడానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్ కేటాయించనట్టు తెలుస్తోంది. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు కూడా మరో రెండు హెలికాప్టర్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది.