Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Telangana Assembly Election Result: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర లేస్తుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను గద్దెదించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
undefined
ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం నేడు తేలనున్నది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈసారి 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు కూడా ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించడంతో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం.. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితాలు వెలుబడే అవకాశం ఉంది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారందరూ ఎలాంటి తీర్పునిచ్చారో తుది వరకు వేచి ఉండాల్సిందే..