ఓటుకు నోటు లాగే నోటుకు సీటు.. కాంగ్రెస్ సీట్లతో రేవంత్ బిజినెస్ : భాగ్యలక్ష్మి సన్నిధిలో నేతల ప్రమాణం (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 18, 2023, 10:24 AM IST

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కాకుండా డబ్బులిచ్చిన వారికే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీట్లు కేటాయిస్తున్నాడని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.  చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట కొందరు సస్పెండెడ్ నాయకులు ఆందోళన  చేపట్టారు. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంతో ఓటుకు  నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన రేవంత్ ఇప్పుడు నోటుకు సీటు అమ్ముకుంటున్నాడని ప్రత్యర్థి పార్టీల నాయకులే కాదు సొంత పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల అమ్మకాల ద్వారా రేవంత్ వందలకోట్లు సంపాదించాడని... అతడి స్వార్థానికి తాము బలయ్యామని కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు అంటున్నారు. కొందరు నాయకులు ఏకంగా టిపిసిసి చీఫ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఆందోళనలకు దిగారు.   

కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల్, ఉప్పల్, బహదూర్ పురా టికెట్లు ఆశించారు కురువ విజయ్ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీల్ బాబా. అయితే వీరికి కాకుండా కాంగ్రెస్ టికెట్ వేరేవాళ్లకు దక్కింది. దీంతో  తీవ్ర అసంతృప్తికి గురయిన నాయకులు హైదరాబాద్ కు చేరుకుని అమరవీరుల స్థూపం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. పసుపు కుంకుమ కలిపిన నీటిని ఒంటిపై చల్లుకుని తడి బట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట విజయ్ కుమార్,లక్ష్మారెడ్డి  ప్రమాణం చేసారు. కాంగ్రెస్ టికెట్లు రేవంత్ అమ్ముకున్నాడని అమ్మవారి ఎదుట ప్రమాణం చేస్తున్నామని... అమ్ముకోకుంటే రేవంత్ ఇదే ఆలయం వద్ద ప్రమాణం చేయాలని నాయకులు సవాల్ చేసారు. లేదంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో తాను ఎలాంటి పక్షపాతం చూపలేదని... అవినీతికి పాల్పడలేదని మనవడిపై రేవంత్ ప్రమాణం చేయాలని విజయ్, లక్ష్మారెడ్డి డిమాండ్ చేసారు. 

Latest Videos

వీడియో

జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో రేవంత్ రూ.4 కోట్లు అడిగారని... ఆ డబ్బులు ఇవ్వలేదనే తనపై కక్షగట్టి టికెట్ రాకుండా చేసాడని ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నట్లు తన వద్ద ఆధారాలు కూడా వున్నాయని...వాటిని కాంగ్రెస్ అదిష్టానానికి పంపించానని తెలిపారు. కష్టాల్లో వున్న కాగ్రెస్ ను బ్రతికించుకుంటూ వచ్చిన తమను సస్పెండ్ చేసే అధికారం నిన్నమొన్న పార్టీలో చేరిన రేవంత్ కు లేదన్నారు. అతడు సస్పెండ్ చేయడం కాదు... మేమే పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు రాగిడి లక్ష్మారెడ్డి, విజయ్, ఖలీల్ తెలిపారు. 

Read More  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ పరిశీలకునిగా ఎంపీ తిరునావుక్కరసర్‌ నియామకం..

గద్వాల టికెట్ ఆశించి భంగపడ్డ విజయ్ కుమార్ టిపిసిసి అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేసారు. రూ.10 కోట్లు, ఐదకరాలు భూమికి గద్వాల టికెట్ ను రేవంత్ అమ్ముకున్నాడని ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ఇటీవల గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద అనుచరులతో కలిసి ఆందోళనకు దిగాడు విజయ్. తన స్వార్థం కోసం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాడు... ఇప్పటికే సీట్ల అమ్మకాల ద్వారా రూ.650 కోట్లు సంపాదించాడని ఆరోపించారు. రేవంత్ అవినీతిపై ఈసి తో పాటు ఈడి కి  ఫిర్యాదు చేయనున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. 

 ఇదిలావుంటే బహదూర్ పురా నియోజకవర్గం నుండి పోటీకి సిద్దమైన కలీమ్ బాబాకు కూడా కాంగ్రెస్ మొండిచేయి ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన అతడు అనుచరులతో కలిసి నేరుగా గాంధీ భవన్ కు చేరుకుని ఆందోళన చేపట్టాడు. టిపిసిసి అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటూ తనలాంటి కష్టపడే నాయకులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసాడు. 

ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ లక్ష్మారెడ్డి, విజయ్ కుమార్, కలీమ్ బాబాను ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతో మరింత ఆగ్రహించిన నాయకులు రేవంత్ రెడ్డి అవినీతిపరుడని... టికెట్లు అమ్ముకుంటున్నాడని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. 

click me!