తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేయగా.. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేయగా.. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే గత కొన్ని నెలలుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కూడా తమ తమ ప్రణాళికలను సిద్దం చేసుకుని.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో పార్టీలు.. మరింత దూకుడుగా ముందుకు సాగనున్నాయి.
తెలంగాణలో నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. అంటే ఇప్పటి నుంచి పోలింగ్ తేదీ నాటికి దాదాపు 50 రోజుల సమయం ఉంది. దీంతో ఈ 50 రోజులు.. మూడు పార్టీలకు కూడా కీలకంగా మారనున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగనుంది. అయితే ఇప్పటికే ప్రణాళికలు రచించుకుని గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్న.. మూడు పార్టీలకు ఎవరి లెక్కలు వారికే ఉన్నాయి.
హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ధీమా..
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 50 రోజుల క్రితమే (ఆగస్టు 21) 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. వారంతా అప్పటి నుంచి గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారంతా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులు వేర్వేరుగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఇప్పటికే ఎన్నికల సమరంలో దిగిపోయారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని, సంక్షేమాన్ని వివరిస్తూ.. కేసీఆర్‌ను హ్యాట్రిక్ విజయంతో ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు.
మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే.. కేసీఆర్ కొన్ని వరాల జల్లులు కురిపించారు. అంతేకాకుండా అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఐదారు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా పెద్దగా అసంతృప్త సమస్యలు లేవని బీఆర్ఎస్ వర్గాలు చెబతున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ ఒకింత ప్రచారంలో ముందు వరుసలోనే ఉందనే చెప్పొచ్చు.
ఇక, ఈ నెల 15 నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. మరోసారి విజయమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంతో పాటు.. పలు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ కీలక హామీలు ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో సాగుతుండటం, గత తొమ్మిదేళ్లలో తాము చేసిన అభివృద్ది, సంక్షేమం, కేసీఆర్ నాయకత్వం.. మరోసారి బీఆర్ఎష్ అధికారం దక్కేందుకు తోడ్పడుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది.
గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ఆశలు..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపైనే ఆశలు పెట్టుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి అవలంభించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న సభలు విజయవంతం కావడంతో.. ఆ పార్టీ మరింత ఉత్సహంతో ముందుకు సాగుతుంది. అయితే పార్టీలో కొందరు నేతల అభిప్రాయ బేధాలు, ఇప్పటివరకు అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోపై ప్రకటన లేకపోవడంతో.. పోరులో కాంగ్రెస్ కాసింత వెనకబడినట్టే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్ర అభివృద్ది కూడా తమకే సాధ్యమని కాంగ్రెస్ చెబుతుంది. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీఆర్ఎస్‌పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డ మీది నుంచి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తుంది. అంతేకాకుండా రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని.. అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకునే తమ మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి పలువురు బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం కూడా తమకు కలిసి వస్తుందనే నమ్మకంతో ఉంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, తెలంగాణలో పలు ప్రాంతాల మీదుగా సాగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర తమ పార్టీకి కలిసి వస్తాయనే నమ్మకాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. తమ పార్టీ 70కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని టీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బస్సు యాత్రలో నిర్వహించడంతో పాటు.. అందులో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొనేలా ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది.
మోదీపైనే ఆశలు..
2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయడం, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ రాష్ట్రంలో గేర్ మార్చింది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ విడతల వారీగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందనే లభించింది. అయితే పొరుగున ఉన్న కర్ణాటకలో పార్టీ ఓటమి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో.. పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం తగ్గింది. మరోవైపు టీ బీజేపీలోని పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా క్యాడర్‌లో ఆందోళనకు కారణమైంది.
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ అగ్రనేత అమిత్ షాలు.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదికలను తెప్పించుకుంటున్నారు. పార్టీ ముఖ్య నాయకులకు చేపట్టాల్సిన కార్యచరణపై దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇటీవల మోదీ వరుస పర్యటనలతో టీ బీజేపీలో కూడా వేగం పెరిగింది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించి.. మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని చూస్తుంది. మొత్తంగా ప్రధాని మోదీపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని.. కుటుంబ పార్టీలతో అభిృద్ది ఉండదని.. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే (కేంద్రంలో, రాష్ట్రంలో.. బీజేపీ ప్రభుత్వాలు) తెలంగాణ అభివృద్ది సాధ్యమనే నినాదంతో ముందుకు సాగుతుంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా సభలు ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తుంది. వీరిచేత తెలంగాణ అభివృద్దికి కేంద్రం చేసిన సాయాన్ని వివరించి.. బీజేపీతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చడం సాధ్యమనే ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.