telangana assembly election 2023 : జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 86 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ దాఖలు చేశారు. నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ.. తన బంధువుల సాయంతో ఆమె జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
telangana assembly election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో నామినేషన్ సెంటర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీల నుంచి బీ ఫారమ్ లు అందిన నేతలు, స్వతంత్ర అభ్యర్థులు తమకు అనువైన రోజున నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
అయితే జగిత్యాల జిల్లాలో ఓ 82 ఏళ్ల వృద్ధురాలు కూడా నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని ఆమె.. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ జగిత్యాల కలెక్టరేట్ లో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె తన బంధువులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఆ వృద్ధురాలి పేరు చీటి శ్యామల. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం క్యూరిక్యాల గ్రామానికి చెందిన ఆమె.. నామినేషన్ దాఖలు చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించారు. తన పెద్ద కొడుకు శ్రీరాంరావు ఆస్తిపై కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిపై కేసు వేయడంతో తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని అన్నారు. ఈ విషయం ప్రభుత్వం, అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తాను నామినేషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.