ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు.. అదే రోజు బడ్జెట్

By Siva KodatiFirst Published Jan 21, 2023, 9:44 PM IST
Highlights

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. 

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం వుంది. అసెంబ్లీ, మండలి సమావేశాల షెడ్యూల్‌కు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సమాచారం అందించింది. ఇకపోతే.. 2023-24 బడ్జెట్‌కు సంబంధించి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి హరీశ్ రావుతో పాటు ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వుండొచ్చని తెలుస్తోంది. ఎన్నికలు జరిగే సంవత్సరం కావడంతో ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం వుంది. 

ఇదిలా ఉంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమర్పించనుంంది. అందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, పన్నుల కేటాయింపులు (కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా) సహా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సాధారణంగా తెలంగాణ సర్కార్‌ మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. అయితే ఈ ఏడాది ఒక నెల ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఎక్కువగానే ఉండనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Also Read; ఫిబ్రవరి తొలివారంలో రాష్ట్ర బడ్జెట్‌.. కసరత్తు ముమ్మరం చేసిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్ కావడంతో సర్వత్రా ఆసక్తి..

రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్‌, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న తెలంగాణ సర్కార్.. ఈ ఏడాది మరో రూ. 20 వేల కోట్లు అధికంగా వెచ్చించే అవకాశం ఉంది. దళిత బంధు తరహాలో రాష్ట్రంలో గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే 2023-24 బడ్జెట్‌లో గిరిజన బంధుకు కూడా భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో చేసిన రుణమాఫీ హామీకి సంబంధించిన నిధులను కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి కూడా కేటాయింపులు భారీగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సంక్షేమ పథకాలతో బ్యాలెన్స్ చేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది.
 

click me!