నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఆసక్తి..!

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 9:58 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత కొంతకాలంగా గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో..  రెండేళ్ల విరామం తర్వాత గవర్నర్ తమిళిసై శాసనమండలి, శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రభుత్వం పంపిన ప్రసంగానికి గవర్నర్ తమిళిసై కట్టుబడి ఉంటారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. 

ఒకవేళ కేంద్రానికి, ప్రధానికి మద్దతుగా గవర్నర్ తమిళిసై తన సొంత ప్రసంగాన్ని జోడిస్తే సీఎం కేసీఆర్, మంత్రులు, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలా స్పందిస్తారు? అనేది కూడా చూడాల్సి ఉంది. 2021 మార్చిలో బడ్జెట్ సెషన్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్రాన్ని, ప్రధాని మోదీని ప్రశంసిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించని విషయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇక, ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం విషయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 

గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? వంటి అంశాలకు సంబంధించి విషయాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. ఇక, ఈ నెల 5వ తేదీన సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్ రాష్ట్ర బడ్జెట్‌ 2023-24పై చర్చించి, ఆమోదం తెలుపనుంది. ఇక, సోమవారం (ఈ నెల 6న) 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 

ఇక, సాధారణంగా తెలంగాణ సర్కార్‌ మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. అయితే ఈ ఏడాది ఒక నెల ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఎక్కువగానే ఉండనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్‌, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న తెలంగాణ సర్కార్.. ఈ ఏడాది మరో రూ. 20 వేల కోట్లు అధికంగా వెచ్చించే అవకాశం ఉంది. దళిత బంధు తరహాలో రాష్ట్రంలో గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే 2023-24 బడ్జెట్‌లో గిరిజన బంధుకు కూడా భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో చేసిన రుణమాఫీ హామీకి సంబంధించిన నిధులను కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి కూడా కేటాయింపులు భారీగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సంక్షేమ పథకాలతో బ్యాలెన్స్ చేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది.

click me!