Hookah Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం విధించింది. ఎవరైనా హుక్కా పార్లర్లు నడుపుతున్నట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
Hookah Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరాపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా వాటి కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా మత్తు పదార్థాల రహిత తెలంగాణ మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హుక్కా పార్లర్ల నిషేధం విధించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మత్తు పదార్థాలపై నిషేధం విధించేలా బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే హుక్కా బిల్లును సభ ఆమోదించింది.
ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బిల్లును ప్రవేశపెడుతూ.. హుక్కా పార్లర్లు నడుపుతున్న వారు యువతలో ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారని, వారు హుక్కా తాగడానికి అలవాటు పడుతున్నారన్నారు. ఎవరైనా హుక్కా పార్లర్లు నడుపుతున్నట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌పై ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేస్తుందని, హుక్కా ధూమపానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కళాశాలల్లో అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.