
ఇవాళ్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్లే సీఎం టూర్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం హస్తినకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్.. మంగళవారం ఢిల్లీకి వెళ్లి అక్కడ వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను పరిశీలించాల్సి వుంది. మే 4న బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇకపై జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి వుంది.
టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. దీనిని గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ ప్రారంభించారు.
ALso Read: ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం.. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కీలక మంతనాలు!!
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోవత్సరం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 200 మంది పార్టీ నేతలు హాజరుకానున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో కేంద్రంలోని అధికార బీజేపీని ఓడించడానికి వ్యూహాలను రూపొందించడానికి వారితో సమావేశం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.