Teenmaar Mallanna: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్‌‌ ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు..

By Sumanth KFirst Published Dec 7, 2021, 1:25 PM IST
Highlights

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) మంగళవారం బీజేపీలో (BJP) చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) మంగళవారం బీజేపీలో (BJP) చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్ ఆయన పార్టీ కండువా వేసి బీజేపీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీజేపీ సభ్యత్వాన్ని తరుణ్ చుగ్.. తీన్మార్ మల్లన్నకు అందజేశారు. 


ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన బీజేపీ సభ్యత్వం ఏదైతో ఉందో అది 15 మీటర్ల తాడు వంటిదని.. వీటితో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్ కుటుంబ సభ్యులను కట్టేస్తానని అన్నారు. అమరవీరుల తల్లిదండ్రుల చేత కేసీఆర్ వీపు పగలగొట్టిపిస్తానని చెప్పారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసాకాని అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని అన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. బీజేపీని ఇచ్చిన తాడు తీసుకుని వచ్చి.. కేసీఆర్ పని పడతానని అన్నారు.  తనపై 38 కేసులు పెట్టి.. కేసీఆర్ సాధించేది ఏమి లేదని చెప్పారు. తనపై కేసు పెడితే కొందరు పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. అధికారం ఉందని అహంకారంతో ఉన్న కేసీఆర్‌కు.. హుజురాబాద్ ఏమైందో తెలియదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Also Read: బీజేపీలో చేరిన విఠల్.. కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి అబ్బాస్ నక్వీ..

ఈ సందర్భంగా మాట్లాడిన తరుణ్ చుగ్ (Tarun Chugh) మాట్లాడుతూ.. తెలంగాణలో సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారని అన్నారు. తీన్మార్ మల్లన్న పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని ఆరోపించారు.  తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను మల్లన్న నిరంతం ప్రశ్నిస్తున్నారని అన్నారు. అందుకే అక్రమంగా పోలీస్ కేసులు బనాయించి.. ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఒక కేసులో బెయిల్ లభించగానే.. మరో కేసులో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల కాగానే మరోసారి అరెస్ట్ చేశారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాలు ఢిల్లీ వరకు వినిపిస్తున్నాయని అన్నారు. 

ఇక, కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరతారనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిసెంబర్ 4వ తేదీన తీన్మార్ మల్లన్న కూడా ధ్రువీకరించారు.

click me!