హైదరాబాదుపై కన్నేసిన చంద్రబాబు: చేసింది తానేనంటూ...

By telugu teamFirst Published Nov 16, 2020, 8:09 AM IST
Highlights

వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించి సత్తా చాటే ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తానే హైదరాబాదును అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుకున్నారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబదుపై కన్నేశారు. ఆయన తీరు చూస్తుంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దింపి సత్తా చాటాలనే ఉత్సాహంతో ఉన్నట్లు అనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకులతో జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలంగాణ పార్టీ నాయకులకు సూచించారు. 

తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగానే హైదరాబాదులో మంచి వాతావరణం ఉందని చెప్పుకున్నారు. శనివారంనాడు చంద్రబాబు తెలంగాణ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ నాయకులకు సూచనలు చేశారు. తమ పార్టీపై హైదరాబాదు ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసం ఉందని చెప్పారు. 

హైదరాబాదులో ఉన్న ఎకో సిస్టమ్ ఎక్కడా లేదని అంటూ అప్పట్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్, జీనోమ్ వ్యాలీ, నల్సార్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు వంటి వ్యవస్థల వల్లనే అది సాధ్యమైందని చెప్పారు. వాటన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. 

ఈ సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కంభంపాటి రామ్మోహన్ రావు, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ గౌడ్, కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు ఎక్కువగా హైదరాాబాదులోనే ఉంటున్నారు. ఈ స్థితిలో జిహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాదులో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా తిరిగి జవసత్వాలను సమకూర్చాలనే ఉద్దేశంతో ఆయన పనిచేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

click me!