
హైదరాబాద్: ఒక వైపు తాయిలాలు రా రమ్మని ఆహ్వానిస్తుంటే, మరోవైపు వెళ్తే ఇబ్బంది పడతావంటూ సన్నిహితులు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీడీపీ సీనియర్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నాయకత్వం భావించింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను బరిలోకి రంగంలోకి దింపింది.
దీంతో మాజీమంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటిలు సండ్రను టీఆర్ఎస్ పార్టీలోకి రప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయితే తాను వచ్చేది లేదని తెగేసి చెప్పడంతో సండ్రను పార్టీలోకి రప్పించడంలో చేతులెత్తేశామని పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు.
ఇకలాభం లేదనుకున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసీఆర్ సండ్రవెంకట వీరయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇచ్చి నీ కలను సాకారం చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారని సమాచారం.
మంత్రి అవ్వాలన్న తన కల టీఆర్ఎస్ పార్టీలో చేరితో సాధ్యమవుతుందని భావించిన సండ్ర తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇక టీఆర్ఎస్ పార్టీలోకి చేరి మంత్రి సండ్ర వెంకట వీరయ్య అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరారట. తన నిర్ణయం త్వరలోనే చెప్తానని కేసీఆర్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరతారని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, సండ్ర సన్నిహితులు రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ లో చేరోద్దంటూ హితవు పలుకుతున్నారట.
అంతేకాదు తెలుగుదేశం పార్టీ సండ్రకు ఇచ్చిన ప్రాధాన్యతను పదేపదే గుర్తు చేస్తున్నారట. టీఆర్‌ఎస్‌లో చేరితే రాజకీయ భవితవ్యం కష్టంగా ఉంటుందని దానికి సంబంధించిన పలు ఉదాహరణలతో వివరించినట్లు ప్రచారం.
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్లు పార్టీలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారట. వెంకటవీరయ్య మంత్రి పదవి ఆఫర్‌తో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని చెప్తున్నారట.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతే వెల్లడైందని, సండ్రకు మంత్రి పదవి వచ్చినా ఎంతవరకు నెగ్గుకురాగలరని ప్రశ్నిస్తున్నారట. సన్నిహితుల ఆలోచనలు సలహాలు విన్న సండ్ర వెంకట వీరయ్య తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారట.
ఇదిలా ఉంటే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సండ్రను తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించారట కేసీఆర్. సండ్రను టీఆర్ఎస్ లో చేర్పిస్తే మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామని తుమ్మలకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో తుమ్మల సైతం తన ప్రయత్నాలను ఎక్కడా ఆపకుండా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.