ప్రజా కూటమి సర్దుబాటు: టీడీపి పోటీ చేసే స్థానాలు ఇవే...

By pratap reddyFirst Published Oct 24, 2018, 12:01 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు కొన్ని ఖరారైనట్లు చెబుతున్నారు. 2014లో తాము గెలిచిన స్థానాల్లో ఈసారి పోటీ చేసేందుకు తెలంగాణ టీడీపి ఆసక్తి ప్రదర్శిస్తోంది. భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేని పక్షంలో ఆయా సీట్లు టీడీపీకే దక్కుతాయని అంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు కొన్ని ఖరారైనట్లు చెబుతున్నారు. 2014లో తాము గెలిచిన స్థానాల్లో ఈసారి పోటీ చేసేందుకు తెలంగాణ టీడీపి ఆసక్తి ప్రదర్శిస్తోంది.

 భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేని పక్షంలో ఆయా సీట్లు టీడీపీకే దక్కుతాయని అంటున్నారు. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టీడీపికి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 8 సీట్లకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

టీడీపి తెలంగాణ అధ్యక్షుడు రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖరారైనట్లు సమాచారం. మిగతావాటిలో కోదాడ, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర సీట్లను కూడా టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేస్తారు, అందువల్ల దానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ కాంగ్రెసును కోరుతున్నట్లు తెలుస్తోంది. 


ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ సీట్లు కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. కుత్బుల్లాపూర్‌, మహేశ్వరం, మక్తల్‌ సీట్లను వీలైతే తీసుకోవవడానికి టీడీపి సిద్ధంగా ఉంది. నామా నాగేశ్వరరావు పోటీ చేయటానికి ఇష్టపడితే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని టీడీపి నాయకత్వం అనుకుంటోంది.

click me!