
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ఖమ్మంకు పయనమయ్యారు. ఆయన వెంట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. మార్గమధ్యలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రసూల్‌పుర వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో ఖమ్మంకు బయలుదేరారు.
రోడ్డుమార్గంలో ఖమ్మం వెళ్తున్న చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. చౌటుప్పల్ లో కూడా చంద్రబాబుకు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
Also Read: తెలంగాణపై టీడీపీ ఫోకస్.. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్
ఇక, ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మధ్యాహ్నం 4 గంటలకు టీడీపీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత తెలంగాణలో పాల్గొంటున్న బహిరంగ సభ కావడంతో.. ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వేదికపై నుంచి చంద్రబాబు.. తెలంగాణలోని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.