తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ ఫేక్ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ ఫేక్ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు కోరినట్టు ఆయన పేరుతో ఉన్న లేఖను వైరల్ చేస్తున్నారని.. అయితే ఆ లేఖ ఫేక్ అని చెప్పారు. ఇక, ‘‘నా తోటి కమ్మ సామాజిక వర్గ ప్రజలకు మీ చంద్రబాబు నాయుడి ముఖ్య విజ్ఞప్తి..’’ పేరుతో చంద్రబాబు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అచ్చెన్నాయుడు స్పందించారు.
ఆ లేఖ ఫేక్ అని.. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికి ఎటువంటి సూచనలు చేయలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే వైసీపీ కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ అని విమర్శించారు. ఫేక్ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ బతుకే ఫేక్ బతుకని, ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ చంద్రబాబు ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు లేఖ రాసినట్టుగా ఓ ఫేక్ లేఖను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని కోరారు. ఈ లేఖలో చంద్రబాబు సంతకం సైతం ఫోర్జరీ చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసు శాఖకు చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.