
తెలంగాణలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలసిందే. తెలంగాణ బీజేపీలోని పలువురు నేతలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చోటుచేసుకుందనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఈ ప్రచారంపై తెలంగాన బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. అధ్యక్ష మార్పు అంశం బీజేపీ హైకమాండ్ దృష్టిలో లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలక బాధ్యతలు ఉంటాయని అన్నారు.
ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ఆయనను మారుస్తారని పలు సందర్భాల్లో ప్రచారం సాగుతూనే ఉంది. బీజేపీ అధిష్టానం నుంచి అలాంటి సూచనలు ఏం లేకపోయినప్పటికీ.. ఆ ప్రచారానికి తెరపడటం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ విధమైన ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ఖండిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకపోవడంపై బీజేపీలోని ఒక వర్గం నాయకులను అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీజేపీ అధిష్టానం ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. మరోవైపు ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. తాజాగా బండి సంజయ్‌కు కూడా ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయనను మార్చనున్నారనే ప్రచారం రెండు, మూడు రోజులుగా విపరీతంగా సాగుతుంది. అయితే అలాంటిదేమి లేదని తాజాగా తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు.