
కరీంనగర్: తెలంగాణ పోలీసులకు బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ ఛుగ్ (tarun chug) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేతిలో పోలీసులు కీలుబొమ్మగా అయ్యారని... టీఆర్ఎస్ (trs) కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలా విధులు నిర్వహించేబదులు పింక్ డ్రెస్ వేసుకోవాలంటూ మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లా జైలులో వున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ (bodige shoba)లో పాటు బిజెపి నాయకులను తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (eatala rajender), రాజాసింగ్ (raja singh), రఘునందన్ రావు (raghunandan rao) కూడా జైలును సందర్శించి నాయకులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ... ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాగరణ దీక్ష (jagaran deeksha) కు యత్నించిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) ని ఒక గ్యాంగ్ స్టర్ లా అరెస్టు చేసారని ఆరోపించారు. చివరకు మహిళా కార్యకర్తలని కూడా జాలీ, దయ లేకుండా దారుణంగా కొట్టారని మండిపడ్డారు.
కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ (satyanarayana) టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై వ్యవహారతీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ను కూడా కలుస్తామని తెలిపారు. కరీంనగర్ లో జరిగిన దౌర్జన్యకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయని తరుణ్ ఛుగ్ హెచ్చరించారు.
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో అరాచక పాలన సాగుతోందని తరుణ్ ఛుగ్ విమర్శించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను జైలులో పెట్టుకోండని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని... ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగడతామని సవాల్ విసిరారు.
తాము ప్రజ సమస్యలపై పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తరుణ్ ఛుగ్ తెలిపారు. తెలంగాణలో గడిలా పాలన జరుగుతోందని... కేసీఆర్ నివాసాన్ని రాజప్రసాదంలా భావిస్తున్నారని విమర్శించారు. టీచర్లు, విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని తరుణ్ ఛుగ్ స్పష్టం చేసారు.
ఇదిలావుంటే ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లోని తన కార్యాలయంలో జాగరణ దీక్షకు సిద్దమైన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంపీ కార్యాలయ తలుపులను గ్యాస్ కట్టర్లలో తొలగించి మరీ సంజయ్ ని అరెస్ట్ చేసారు. అంతేకాకుండా అక్కడే వున్న బిజెపి నాయకుల్లో కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతావారిని చెదరగొట్టారు. కోవిడ్ నిబంధను పాటించడం లేదంటూ పోలీసులు సంజయ్ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసారు.
ఈ సమయంలో అక్కడే వున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా దీక్షకు దిగితే ఇంత దారుణంగా వ్యవహరించడం ఏమిటంటూ పోలీసులను నిలదీసారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆమెపై కేసులు నమోదుచేసిన పోలీసులు నిన్న(బుధవారం) అరెస్ట్ చేసారు.