ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని నిన్ననే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే .
ఈ నెల 16వ తేదీన పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని కోరారు. అయితే ఏ కేసు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో తనకు ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులను కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు సమయం ఇవ్వలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం ఈడీ అధికారుల విచారణకు రోహిత్ రెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. ఆరు గంటల పాటు ఈడీ అధికారులు పైలెట్ రోహిత్ రెడ్డిని విచారించారు. వ్యక్తిగత వివరాలు, తన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వ్యాపారాల గురించి మాత్రమే అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాకు తెలిపారు.ఈ నెల 20వ తేదీన కూడా ఈడీ అధికారుల విచారణకు రోహిత్ రెడ్డి హాజరయ్యారు. 20వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన విచారణకు వచ్చారు. రెండో రోజున ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు గురించి ఈడీ అధికారులు విచారించినట్టుగా పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు.
రోహిత్ రెడ్డిని విచారించిన తర్వాత సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ కేసులో అభిషేక్ ఆవాలను ఈడీ అధికారులు ఇటీవలనే విచారించారు. అభిషేక్ తో పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడితో సంబంధాలున్నాయని అభిషేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నించారు. రేపు కూడా ఈడీ అధికారులు ఆయననుప్రశ్నించే అవకాశం ఉంది. రోహిత్ రెడ్డితో ఏమైనా వ్యాపార సంబంధాలున్నాయా, ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంంధించి ఈడీ అధికారులు సమాచారం సేకరించే అవకాశం ఉంది. తనకు నందకుమార్ తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే .
also read:కేసులో ఇరికించే కుట్ర, అరెస్ట్ చేసినా తగ్గేది లేదు:తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నందకుమార్ విచారణ సమయంలో అనుకూలమైన స్టేట్ మెంట్ తీసుకుని తనను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈడీపై పైలెట్ రోహిత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.