
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతికి ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, త్రివిధ దళాలకు చెందిన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సత్కరించారు. అనంతరం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులన కేసీఆర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పరిచయం చేశారు. ఇక, రాష్ట్రపతి పర్యటన సందర్బంగా.. చాలా కాలం తర్వాత గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఒకే వేదిక మీద కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది
అంతకుముందు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయలిదేరి వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా శ్రీశైలం వెళ్లారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఇక, శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.
రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌కు శీతకాల విడిదికి రాష్ట్రపతి..
శీతకాల విడిది కోసం 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చివరిసారిగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 పరిస్థితుల కారణంగా రాష్ట్రపతి శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాలేదు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక, ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము.. శీతకాల విడిదికి రావడం ఇదే తొలిసారి. ఇక, రాష్ట్రపతి బస చేయనున్న బొల్లారంలోని భవనాన్ని 1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో నిర్మించారు. బ్రిటీష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగా.. ఆ తర్వాత నుంచి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. రాష్ట్రపతి నిలయం మొత్తం 90 ఎకరాల ప్రాంగణంలో ఉండగా.. ప్రధాన భవనం 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.