ఏపీ ప్రాజెక్ట్‌లు: కేంద్రానికి టీ. కాంగ్రెస్ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Dec 18, 2020, 4:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై తెలంగాణ కాంగ్రెస్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రటరీని కలిశారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై తెలంగాణ కాంగ్రెస్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రటరీని కలిశారు.

అనంతరం సంపత్ మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి గాని నెట్టెంపాడు వంటి పరివాహక ప్రాంతమంతా కూడా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు.

దీనిపై తాము ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా అర్థంకావడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని సంపత్ ఆరోపించారు.

మా ఆవేదనలు, ఆక్రందనలు కేంద్ర జల శక్తి జాయింట్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సంపత్ కుమార్ ధ్వజమెత్తారు.

కేంద్ర జల శక్తి శాఖ కూడా రెండు రాష్ట్రాలతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీటి విషయంలో తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేని ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని సంపత్ తెలిపారు.

కృష్ణా బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ హక్కులను కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తీసుకువెళ్తుందని.... కానీ తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదని ఆయన విమర్శించారు. అంతిమంగా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. 

click me!