సునీల్ కనుగోలు ఆఫీసులో సోదాలు.. పోలీసుల నోటీసులపై హైకోర్టు స్టే.. కాంగ్రెస్‌కు ఊరట..

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 11:08 AM IST
Highlights

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌ రూమ్‌పై దాడి చేసిన పోలీసులు ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులకు సంబంధించి ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌ రూమ్‌పై దాడి చేసిన పోలీసులు ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులకు సంబంధించి ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్‌ సోషల్ మీడియా వార్‌రూమ్‌ సిబ్బంది మోండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలకు హైదరాబాద్‌ నగర పోలీసు సైబర్‌ క్రైమ్‌ విభాగం జారీ చేసిన సీఆర్‌పీసీ 41ఏ  నోటీసులపై తెలంగాణ హైకోర్టు బుధవారం స్టే విధించింది. వివరాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారనే కేసుకు సంబంధించి పోలీసులు.. కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే మోండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన  నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. వారి ముగ్గురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేశారు. అయితే సునీల్ కనుగోలు పరారీలో ఉన్నారు.తమపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తదుపరి చర్యలను నిలిపివేయాలని శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేయడం దురుద్దేశపూర్వకంగా, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. 

అయితే ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్లను నిందితులుగా చేర్చారని.. వారి సమక్షంలోనే పంచనామాపై సంతకాలతోపాటు సంబంధిత సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇరుపక్షాల వాదనల విన్న హైకోర్టు.. ముగ్గురికి పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా  వేసింది. 

click me!