నేడు గాంధీభవన్‌కు దిగ్విజయ్ సింగ్.. టీ కాంగ్రెస్‌ నేతలతో చర్చలు.. సమస్యలు పరిష్కారమయ్యేనా..?

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 9:45 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైకమాండ్ దూతగా రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. నేడు పలువురు టీపీసీసీ నేతలతో సమావేశం కానున్నారు.
 

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైకమాండ్ దూతగా రంగంలోకి దిగారు. బుధవారం హైదరాబాద్‌కు బయలుదేరకముందే.. టీ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఢిల్లీలో దిగ్విజయ్ కొంత సమాచారం సేకరించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శలు బోసురాజు, నదీవ్ జావెద్, రోహిత్ చౌదరిలతో సమావేశమైన దిగ్విజయ్ సింగ్..  టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డితో సీనియర్లకు మధ్య గ్యాప్‌ గురించి, పీసీసీ కమిటీలపై అభ్యంతరాలు.. సహా తదితర అంశాలపై వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

బుధవారం రాత్రి హైదాద్‌కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, వీ హనుమంతరావు, అంజన్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దిగ్విజయ్ తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. దిగ్విజయ్‌ను సింగ్‌ను కలిశారు. 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి దిగ్విజయ్‌కు తెలిపానని, పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా మాట్లాడినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ గాంధీ భవన్‌‌లో నేతలకు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ నాయకులతో ఆయన విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే దిగ్విజయ్‌ ముందు తమ వాదనలు వినిపించేందుకు ఇటు రేవంత్ వర్గం, అటు సీనియర్లు సిద్దమయ్యారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమను వలస నేతలు అనడం, వేరుగా చూస్తున్నారనే వంటి అంశాలను రేవంత్ వర్గం దిగ్విజయ్ సింగ్‌ ముందు ఉంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ వర్గంలోని సీతక్క, వేం నరేందర్‌ సహా 10 మంది వరకు దిగ్విజయ్‌తో సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు సీనియర్లు కూడా దిగ్విజయ్‌తో సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌ల వైఖరితో పాటు, పీసీసీ పదవుల కేటాయింపుకు సంబంధించి అంశాలపై వీరు దిగ్విజయ్‌కు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే నేతలతో చర్చల సందర్భంగా అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు దిగ్విజయ్ సింగ్‌ ప్రయత్నాలు చేపట్టనున్నారు. మరోవైపు తటస్థంగా ఉన్న కొందరు నేతలను నుంచి కూడా దిగ్విజయ్ సమాచారం సేకరించనున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో పార్టీ మాజీ ఎంపీల బృందం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌కు ఓ నివేదిక అందజేసే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి. నేతలందరితో సంప్రదింపుల తర్వాత దిగ్విజయ్‌ సింగ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు ఢిల్లీలో ఉన్నందున వారు హైదరాబాద్‌లో దిగ్విజయ్‌తో సమావేశం కాలేకపోవచ్చని తెలుస్తోంది. వీరు తర్వాత విడివిడిగా దిగ్విజయ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. అందరి నుంచి చర్చలు జరిపిన తర్వాత.. పార్టీ అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ నివేదిక అందజేయనున్నారు. అయితే ట్రబుల్ ‌షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ఎంట్రీతో టీ కాంగ్రెస్‌లో చెలరేగిన తుఫాన్ చల్లారుతుందని పార్టీలోని మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

click me!