కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంత సమాచారాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం కోరింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 20 రకాల సమాచారాన్ని కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగింది.
అయితే అందులో 4 అంశాలపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ లేఖ రాసింది. ఆదివారం(అక్టోబర్ 29)లోగా ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని గడువు విధించారు. ఒకవేళ సమాచారం ఇవ్వకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారం లేదని భావించాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొంది. అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
ఇక, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ బృందం మేడిగడ్డ బ్యారేజ్‌ను కూడా పరిశీలించింది. అనంతరం హైదరాబాదలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమావేశం నిర్వహించింది.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ.. బ్యారేజీ నిర్మాణ సమయంలో నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వంటి అంశాలపై దృష్టి సారించింది. ఎల్ అండ్ టి కంపెనీతో ఒప్పందం, ప్రాజెక్ట్ నిర్వహణలో దాని బాధ్యత, సాంకేతిక జోక్యాలకు సంబంధించి కంపెనీ అంగీకరించిన కార్యాచరణ ప్రణాళికతో పాటు అన్ని అంశాల గురించి కేంద్ర బృందం ఆరా తీసినట్లు తెలిసింది.
అయితే బ్యారేజీ నిర్వహణలో నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ పాత్రను కచ్చితంగా పాటించామని, పిల్లర్లు కుంగుబాటుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు.