ఏం జరిగిందో.. చాక్లెట్లు తిని, వింతంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..!

By SumaBala BukkaFirst Published Jan 10, 2024, 9:05 AM IST
Highlights

ఈ చాక్లెట్లు తిన్న విద్యార్థులు.. మత్తులోకి జారుకుంటున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. 

శంషాబాద్ : హైదరాబాద్ లోని శంషాబాద్ లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. శంషాబాద్ లోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులకు పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాల యజమానులు చాక్లెట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ చాక్లెట్లు తిన్న విద్యార్థులు.. మత్తులోకి జారుకుంటున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇలా విద్యార్థులు మత్తులో విచిత్రంగా ప్రవర్తించడం అనేది ఒక్కసారిగా జరిగిందేమీ కాదు. కొంతకాలంగా ఇది జరుగుతుందట. అయితే ఇటీవల పాఠశాలకు కొత్తగా వచ్చిన ప్రధానోపాద్యాయుడి చొరవతో ఈ విషయం వెలుగు చూసింది. అంతకు ముందు విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం, పేదవారు కావడంతో ఉదయం పూట తినకుండా రావడం వల్లే ఇలా నీరసంగా ఉంటున్నారని మిగతా టీచర్లు అనుకున్నారు. 

తరగతి గదిలో మత్తుగా ఉన్నట్లు ఉండడం, పాఠాలు సరిగా వినకపోవడం, అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోవడం చేస్తుండేవాళ్లు. ఆ సమయంలో మేము బిస్కెట్లో, మంచినీళ్లో ఇచ్చి వారిని కాస్త తేరుకునేలా చేసేవాళ్లం అని టీచర్లు చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు చుట్టుపక్కలున్న కంపెనీలలో పనిచేస్తుంటారు. తినకుండానే స్కూళ్లకు వస్తుండేవాళ్లు. దీంతో నీరసంగా ఉన్నారనుకునేవాళ్లమని తెలిపారు. 

అయితే, ఇది రెగ్యులర్ గా జరుగుతుండడంతో స్కూలు ప్రధానోపాద్యాయుడికి అనుమానం వచ్చి.. ఎందుకిలా జరుగుతుంది అని ఆరా తీస్తే.. స్కూలు బయట చాక్లెట్స్ తిన్నతరువాత ఇలా జరుగుతుందని తేలింది. దీంతో మరింత లోతుగా పరిశీలిస్తే అవి గంజాయి చాక్లెట్లని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి దర్యాప్తు చేశారు. 

అవి గంజాయి చాక్లెట్లే అని తేలింది. పాన్ డబ్బాల యజమానులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర చాక్లెట్లు బయటపడ్డాయి. మొదట ఫ్రీగా ఇచ్చి, అలవాటు చేసి ఆ తరువాత ఒక్కో చాక్లెట్ రూ.15, రూ.20 లకు ఒకటిగా అమ్ముతున్నారు. పెద్దక్లాస్ స్టూడెంట్స్ నే ఇలా టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. 

click me!