తెలంగాణ: ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. భగ్గుమన్న విద్యార్ధి లోకం

By Siva KodatiFirst Published Mar 25, 2021, 2:50 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐక్య ఉద్యోగ సంఘాలతో కలిసి ఓయూ విద్యార్థులు గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐక్య ఉద్యోగ సంఘాలతో కలిసి ఓయూ విద్యార్థులు గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు.

దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెంచిన వయో పరిమితిని తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆర్ట్స్‌ కళాశాల లైబ్రరీ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నేతలను అరెస్టు చేసి ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.   

అటు కూకట్‌పల్లిలోనూ ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఉద్యోగ విరమణ వయసు పెంపును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో విద్యార్ధి నేతలను అరెస్టు చేసిన పోలీసులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ గురువారం నాడు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కకుండా పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

త్వరలోనే రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెన్షన్ పెంపు బిల్లుకు కూడ అసెంబ్లీ ఆమోదించింది.

కనీస పెన్షన్ ను రూ. 50 వేల నుండి రూ. 70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చు పరిమితిని లక్ష రూపాయాల నుండి రూ. 10 లక్షలకు పెంచుతూ సభ ఆమోదం తెలిపింది.
 

click me!