డబ్బు కోసం కన్న కొడుకును అమ్మిన కసాయి తండ్రి..

By SumaBala Bukka  |  First Published May 30, 2023, 12:51 PM IST

నాలుగేళ్ల కొడుకును డబ్బుల కోసం అమ్మేశాడో కసాయి తండ్రి. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబానికి రెండున్నర లక్షలకు అమ్మేశాడు.


వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఓ తండ్రి కడుపు తీపిని మరిచిపోయి.. కన్న కొడుకునే అమ్మకానికి పెట్టాడు. కన్నతల్లికి తెలియకుండా కొడుకును తీసుకెళ్లి అమ్మేశాడు.  బయటికి తీసుకెళ్తానంటే ఉత్సాహంగా తండ్రి వెంట వెళ్ళిన ఆ చిన్నారి మళ్ళి తిరిగి రాలేదు. ఆ కసాయి తండ్రి  కొడుకులు రూ.2.50 లక్షలకు అమ్మేశాడు. ఏం జరుగుతుందో తెలియని ఆ అమాయక చిన్నారి తండ్రినే చూస్తూ ఉండిపోయాడు.

తండ్రితో వెళ్ళాలో.. తండ్రి తనను అప్పగించిన కొత్త వారితో వెళ్ళాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. తనను కొత్తవారికి అప్పగించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్న తండ్రిని ‘నాన్న.. నాన్న..’ అంటూ పిలిచిన ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు. వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఏడ్చి, ఏడ్చి ఇక కన్నీళ్లు రాక.. ఆ కొత్త వారి భుజం మీదే సొమ్మసిల్లిపోయాడు ఆ చిన్నారి.

Latest Videos

మరోవైపు కొడుకు కనిపించకపోవడంతో తల్లి వెతకడం మొదలుపెట్టింది. దీంతో బాలుడిని అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది. భర్త  తనతో పాటు చిన్నారిని తీసుకెళ్ళిన  విషయాన్ని భార్య నిలదీసింది. కొడుకు ఎక్కడ అని అడిగింది. దీంతో అసలైన దారుణ విషయం వెలుగులోకి వచ్చింది.  తండ్రే కన్న కొడుకును తీసుకుని వెళ్లి.. ఎక్కడో వదిలేసి వచ్చాడని తల్లి అనుమానించడంతోనే.. ఆ భర్త గుట్టు రట్టయింది.

డాక్టర్ రాలేననడంతో కాన్పు చేసిన నర్సులు.. వికటించడంతో శిశువు మృతి...

ఈ  ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లాలో మసూద్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. ఆర్థిక ఇబ్బందులో.. మరే కారణమో తెలియదు కానీ తన పెద్ద కొడుకు అయాన్ ను అమ్మేయాలని మసూద్ ప్లాన్ వేశాడు. హైదరాబాదులోని ఓ కుటుంబానికి అమ్మడానికి రెండున్నర లక్షలకి బేరం కుదుర్చుకున్నాడు. దీనికి శేఖరాసికుంటకు చెందిన ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

వీరు అడిగిన మొత్తం ఇంకా ఎక్కువ ఉండడంతో హైదరాబాద్కు చెందిన కుటుంబం రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీనికి అంగీకరించిన మసూద్ నాలుగు రోజుల క్రితం పెద్దకొడుకును తీసుకెళ్లి వారికి అప్పగించాడు. అయితే, నాలుగు రోజులుగా అయాన్ కనిపించకపోవడంతో తల్లి భర్తను నిలదీసింది. కొడుకుని ఎక్కడికి తీసుకెళ్లావ్ అంటూ ప్రశ్నించింది. మొదట మసూద్  అయాన్ ను తన సోదరి దగ్గర ఉంచినట్లు తెలిపాడు.
 
కానీ, అతని మాటల మీద అనుమానం వచ్చిన భార్య.. ఆమెను కనుక్కోగా అక్కడ అయాన్ లేడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి మసూద్ ను నిలదీశారు. ఇక నిజం చెప్పక తప్పదు అనుకుని… రెండున్నర లక్షలకు బాబును అమ్మేసినట్లుగా చెప్పాడు. అది విన్న కుటుంబ సభ్యులు, భార్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. కన్న బిడ్డను అలా ఎలా అమ్మావ్ అంటూ అసహ్యించుకున్నారు.

కానీ మసూద్ లో ఎలాంటి పశ్చాతాపం కనిపించలేదు. అయాన్  ఎక్కడున్నాడో చెబితే తాను ఇంటికి తీసుకొచ్చుకుంటానని భార్య అన్నా కూడా మసూద్ వినలేదు. వారు అయాన్ ను ఎక్కడికి తీసుకెళ్లారో తనకు తెలియదంటూ బుకాయించాడు. దీంతో చేసేదేమీ లేక బాలుడి మేనమామ మసూద్ మీద పోలీస్ స్టేషన్లో.. కొడుకును అమ్ముకున్నాడంటూ ఫిర్యాదు చేశాడు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు చేపట్టి మొత్తం ఐదుగురికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని తేల్చారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

click me!