లైబ్రరీలో ఉరేసుకున్న విద్యార్థి... ప్రిన్సిపాల్ వేధింపులే కారణమంటున్న తండ్రి

By sivanagaprasad KodatiFirst Published 12, Sep 2018, 12:19 PM IST
Highlights

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ లైబ్రరీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ లైబ్రరీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామానికి చెందిన 15 ఏళ్ల అబ్దుల్ ఖలీద్ వనస్థలిపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఖలేద్ ఒంటరిగా లైబ్రరీ వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. స్నేహితులు చదువుకోవడానికి వెళుతున్నాడని అనుకున్నారు. అయితే సమయం గడుస్తున్నా ఎంతకీ ఖలేద్ హాస్టల్‌కు రాకపోవడంతో స్నేహితులు లైబ్రరీ వద్దకు వెళ్లి చూడగా.. అక్కడ సీలింగ్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే విషయాన్ని వార్డెన్‌కు తెలిపారు.

ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శవపరీక్ష అనంతరం బాలుడి మృతదేహన్ని అతని తండ్రికి అప్పగించారు.

అయితే ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాలుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఇతనికి బాలల హక్కుల సంఘం నేతలు మద్ధతుగా నిలిచారు. ప్రిన్సిపాల్‌పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి.. అయినప్పటికీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదని వారు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated 19, Sep 2018, 9:23 AM IST