
నిజామాబాద్‌లో జిల్లాలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజమాబాద్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. వివరాలు.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి హర్ష నిజామాబాద్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతుంది. అయితే ఈరోజు ఓ పరీక్ష రాయాల్సి ఉండగా.. హర్ష మాత్రం హాస్టల్‌లోనే ఉండిపోయాడు. అయితే కాసేపటికి స్నేహితులు వచ్చి చూడగా.. హర్ష హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించారు. దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.
ఇదిలా ఉంటే.. హర్ష మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్ష ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని వారు చెబుతున్నారు. మరోవైపు హర్ష చదవుల్లో ప్రతిభ కనబరిచేవాడని.. ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదని అతని స్నేహితులు చెబుతున్నారు.
అయితే ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
మరోవైపు ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఇంకా ప్రీతికి ఎక్మో ద్వారా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.