
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అలయ్ బలయ్‌కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు జనం. అయితే అప్పుడే ప్రసంగం ప్రారంభించారు అవధాని గరికపాటి నరసింహారావు. జనం తన ప్రసంగాన్ని పట్టించుకోకుండా మెగాస్టార్‌తో సెల్ఫీలు తీసుకోవడంలో ఆతృత చూపించారు. దీంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి.. వెంటనే సెల్ఫీలు దిగడం ఆపేశారు చిరంజీవి. అంతేకాదు.. గరికపాటి వద్దకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఎంతో ఇష్టమని... ఆసక్తిగా వింటానని చెప్పారు. అంతేకాదు ఒకరోజు తన ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు మెగాస్టార్.
అలయ్ బలయ్ కార్యక్రమానికి తాను రావాలని చాలా కాలంగా అనుకుంటున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ తనకు అవకాశం రాలేదన్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. కానీ ఇవాళ తనకు ఈ అవకాశం దక్కిందన్నారు. ఒక మంచి సినిమా హిట్ సాధించిన మరునాడే అలయ్ బలయ్ కార్యక్రమంలో తాను పాల్గొనడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్న అలయ్ బలయ్ కి విస్తృత ప్రాచుర్యం తీసుకు వచ్చిన ఘనత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకే దక్కుతుందని ప్రశంసించారు. స్నేహనికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రేమను పంచే కార్యక్రమంగా అలయ్ బలయ్ ను చిరంజీవి అభివర్ణించారు. అలయ్ బలయ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ALso REad:ప్రేమను పంచే సంస్కృతిని కొనసాగించాలి: అలయ్ బలయ్ లో డోలు కొట్టి చిందేసిన చిరంజీవి
దసరా పండుగ తర్వాత తెలంగాణలో జమ్మి ఆకుతో ప్రేమను ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయం అద్భుతమైందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమలో హీరోలంతా కలిసి మెలిసి ఉన్నప్పటికీ అభిమానుల మధ్య అంతరం ఉండేదన్నారు. ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానుల మధ్య పొసగని వాతావరణం ఉండేదన్నారు. ఈ అంతరాన్ని తగ్గించాలని తాను గతంలో ప్రయత్నించినట్టుగా చిరంజీవి గుర్తు చేశారు. తాను నటించిన సినిమా హిట్ అయితే సినీ పరిశ్రమలో ఉన్న తన స్నేహితులందరికి పిలిచి పార్టీ ఇచ్చేవాడినని ఆయన తెలిపారు. ఈ పార్టీలో అందరితో కలిసి మెలిసి మాట్లాడుకోవడంతో పాటు ప్రేమను ఇచ్చిపుచ్చుకొనే వాళ్లమని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.