ఫాం హౌజ్ ఆడియో, వీడియోల విడుదలను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన నిందితుడి భార్య..

By SumaBala Bukka  |  First Published Nov 4, 2022, 7:59 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ ముగిసేవరకు దీనికి సంబంధించిన ఆడియో, వీడియోల విడుదలను ఆపాలని కోరారు. 


హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి మీడియా సహా ఎవరూ, ఎలాంటి వీడియో, ఆడియో విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ కేసులో నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో సాగుతున్న ఈ దర్యాప్తుపై విశ్వాసం లేదని, దీనిపై సిబిఐ లేదా ఏదైనా  స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థతో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరె నందకుమార్ భార్య చిత్రలేఖ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే నిందితులతో మాట్లాడిన కొన్ని ఆడియోలను మీడియా విడుదల చేసిందని, ఫోన్ లను ట్యాప్ చేశారని తెలుస్తోందని, అనధికారికంగా ట్యాప్ చేసిన ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు వినడం టెలిగ్రాఫిక్ చట్టానికి విరుద్ధమని అన్నారు. 

దర్యాప్తు జరుగుతున్న తీరును పరిశీలిస్తే పారదర్శకంగా  జరుగుతుందని నమ్మకం లేదని అన్నారు. అధికార పార్టీ ప్రమేయంతో పోలీసులు కేసు నమోదు చేశారని, ఫాంహౌస్లో దాడులు జరగక ముందే కమిషనర్ మీడియా ముందుకు రావడం.. దాడుల అనంతరం ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వెళ్లడం దీనికి ఉదాహరణ అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్న ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని,  లేనిపక్షంలో అధికరణం 21 ప్రకారం నిందితుడి హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు.  

Latest Videos

undefined

ఆదరణ తగ్గినందుకే ఆక్రోశం.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై కిషన్ రెడ్డి స్పందన..

టిఆర్ఎస్, బిజెపిల మధ్య జరుగుతున్న యుద్ధంలో తన భర్త  బాధితుడు అయ్యాడని అన్నారు. తన భర్తకు శిక్ష పడడానికి వీలుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలను సృష్టించడానికి అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సీబీఐతో లేదా సిట్ తో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ ముగిసేదాకా ఎలాంటి వీడియో, ఆడియో విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్,  రాజేంద్ర నగర్ ఏసిపి, మొయినాబాద్ ఎస్హెచ్ఓ, కేంద్ర హోం శాఖ,  సి.బి.ఐ,  తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను పేర్కొన్నారు. 

కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలు బయటికి వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మునుగోడు పోలింగ్ ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు కూడా ఈ వీడియోలు పంపానని.. అని  రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు ఈ వీడియోలు పంపుతానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు ఫాం హౌస్ ఫైల్స్ ఇప్పటికే పంపించానని దేశంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు ఈ వీడియోలు పంపుతామని సీఎం తెలిపారు. బెంగాల్ వెళ్లి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని స్వయంగా ప్రధానే చెప్పారని.. ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని సృష్టిస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్ నాలుగు రాష్ట్రాల్లో  ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వీడియోలో వాళ్ళు చెప్పినట్టు  చెప్పుకొచ్చారు. 

click me!