
సింగరేణి గనులు వేలం వేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల అన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలోని నాలుగు గనులను ఈ నెల 13న వేలం వేయాలని నిర్ణయింకోవడం సరైంది కాదని అన్నారు. గనులను ప్రయివేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంతవరకు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని అన్నారు.
బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల సమ్మె... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
ఈరోజు నుంచి మొదలైన సమ్మె..
కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను వేలం వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె మొదలు పెట్టాయి. టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు.సింగరేణి పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో, భూగర్బ గనుల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎప్పుడూ కార్మికులతో సందడిగా ఉండే సింగరేణి గునులు ఈరోజు బోసిపోయాయి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా విస్తరించి ఉన్న జిల్లాల్లో ఈరోజు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఎక్కడిక్కడ నిరసనలు తెలిపారు. బైక్ ర్యాలీలు చేపట్టారు. కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధానికి సీఎం కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. పలు రాష్ట్రాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలోని సింగరేణి గనులే ముఖ్య ఆధారమని తెలిపారు. ఇలాంటి గనులను వేలం వేసి ప్రయివేటుకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని ఆ లేఖలో సీఎం కోరారు.